Sunday, May 8, 2011

దళితుడు కుర్చీమీద కూర్చున్నందుకు

అనంతపురం -

చెన్నేకొత్తపల్లి మండలము నామాల గ్రామంలో 29-3-2011 న రాత్రి 9గంటలకు స్తానిక యు.పి.స్కూలు నందు ఆధార్ కార్డుల కొరకు పేర్లను నమోదు చేసుకుంటున్నారు. అప్పుడు ఆశాది తిరుపాలు అనే దళితుడు వికలాంగుడైనందున ఎక్కువ సేపు నిలబడలేక కూర్చోడానికి కుర్చీని అడుగగా ఆధార్ కార్డు సభ్యులు తిరుపాలుకు కుర్చీఇచ్చారు. ఇది సహించలేని రెడ్డి కులస్తులిద్దరు తిరిపాలును కొట్టి కుర్చీని లాగివేయడానికి ప్రయత్నించారు. ఈరోజు వికలాంగుడనని ఓ దళితుడు మాముందు కుర్చీలో కూర్చుంటే రేపు బాగున్న దళితుడుకూడా కూర్చుంటాడని అన్నారు. స్తానికులు కొందరు కలుగజేసికొని వారిని బయటకు పంపారు. వారు బయటికి వెళ్ళి కిటికీ దగ్గర కూర్చున్న తిరిపాలును జుట్టు పట్టుకొని బలంగా లాగి కిటికీ చెక్కదిమ్మెకు వేసి పొడిచారు. క్రింద పడిపోయిన తిరిపాలును కుటుంబ సభ్యలు ఇంటికి తీసుకువెళ్ళి నీళ్ళు త్రాగించబోతుండగా తిరిపాలు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఆటోలో ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకుపోగా అప్పటికే ప్రాణం పోయినట్లు డాక్టరు నిర్ధారించాడు.

ది.3-4-11న ఓపిడిఆర్, హెచ్చారెఫ్, ఎపిసిఎల్ సి, కులనిర్మూలనా పోరాటసమితి, పట్టణ పేదల సంఘం, మరియు సత్యసాయి వాటర్ వర్క్స సభ్యులు తిరుపాలు కుటుంబాన్ని విచారించారు. తిరుపాలు తల్లి కుళ్ళాయమ్మ, భార్య నాగులమ్మ, కుమారుడు సంజీవ రాయుడు (16), కూతుర్లు శివకుమారి (14), పరమేశ్వరి (12) జరిగిన సంఘటనను వివరిస్తూ కంటతడి పెట్టారు.

కమిటీ ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో పోష్టు మార్టం చేసిన డాక్టరును విచారించగా తిరిపాలు ఎడమ కణతపై ఎముక విరిగీ రక్తస్రావము జరిగి, మెదడులోకి రక్తముచేరి,రక్తము గడ్డకట్టి మరణించాడని చెప్పాగు. తిరిపాలును చంపినవారిపై కేసు నమోదుచేసి శిక్షించాలని, భార్య నాగులమ్మకు ప్రభుత్వోద్యోగం కల్పించి తిరిపాలు కుటుంబాన్ని ఆదుకోవాలని ఓపిడిఆర్ డిమాండ్ చేసింది.

Saturday, May 7, 2011

బెయిల్ పై బినాయక్ సేన్ విడుదల హర్షణీయం

పియుసియల్ అనే పౌరహక్కుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మరియు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అయిన వినాయక్ సేన్ కు రాయపూర్ సెషన్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. మావోయిష్టు పార్టీకి తోడ్పడుతున్నాడనే ఆరోపణతో ఆశిక్ష విధించింది.

బినాయక్ సేన్ ఛత్తీస్ ఘడ్ లోని పేద గిరిజనుల మధ్య నివసిస్తూ వారికి వైద్యం అందించుచున్న పిల్లల డాక్టరు. గిరిజనులపై రాజ్యం అమలుచేస్తున్నహింసాకాండను బయటిలోకానికి వెల్లడి చేస్తున్న కృషీవలుడు. ఈపని చేయడం రాజ్యానికి కంట్లో దూలంగా మారింది. ఆయనపై వేధింపులు ప్రారంభమైనాయి. బినాయక్ సేన్ పై ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వము ఆయన నిషిద్ధ సాహిత్యం దొరికిందనే సాక్ష్యంతో రాజద్రోహనేరం మోపి 4సంవత్సరాలు జైలులో నిర్బంధించింది. రాయపూర్ సెషన్స్ కోర్టు బినాయక్ సేన్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా వివిధ దేశాలలోని అనేకమంది మేధావులు, నోబుల్ బహుమతి గ్రహీతలు పెద్ద ఉద్యమాన్ని నిర్వహించారు. భారత సుప్రీం కోర్టు 15-4-2011న బినాయక్ సేన్ బెయిల్ పై విడుదలచేస్తూ సరైన ఆధారాలు లేవని ప్రకటించింది. ఓపిడిఆర్ ఈ పరిణామం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంది.

బానిస చట్టాలతో పాలించిన బ్రిటిష్ పాలకులచే రూపొందించబడి , బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అనేకమంది దేశభక్తులపైన, నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిష్టలపైన, నక్సల్ బరీ వంటి ఉద్యమకారులపైన – అదే ఇండియన్ పీనల్ కోడ్ – చట్టం ప్రకారం నేటికీ శిక్షలు విధింపబడడం మన పాలనలోని డొల్లతనాన్ని తెలియజేస్తున్నాయి.

Monday, March 28, 2011

ఎరుకల మహిళలపై అత్యాచారం చేసిన పోలీసులను శిక్షించాలి

వారు తమ మాన ప్రాణాలకు రక్షణలేదని, ఉరవకొండ, రాయదుర్గం పోలీసులు తమను వేధిస్తూ, చిత్రహింసలకు గురిచేస్తూ, వేలాది రూపాయలు లాక్కుంటున్నారనీ, పందులు మేపుకుంటూ, పరకలు అమ్ముకుంటూ, గద్దె చెప్పుకుంటూ జీవిస్తున్న తమను పోలీసులు వేధిస్తున్నారని చెప్పారు. అందులో ఇద్దరు మహిళలు వచ్చి తమను శేఖర్, వెంకటేష్ అనే పోలీసులు అఘాయిత్యం జరిపారని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కమిటీ సభ్యులకు వివరించారు. తన 8వ తరగతి చదువుకుంటున్న నాగరాజనే కుమారుణ్ణి రెండుసార్లు పోలీసు స్టేషనుకు తీసుకెళ్ళి దొంగతనం కేసు పెట్టి తీవ్రంగా కొట్టారని , పోలీసుల దెబ్బలవల్ల విరిగిన ఆ పిల్లవాని చేతిని వాని తండ్రి నాగన్న కమిటీ సభ్యులకు చూపాడు.

కమిటీ సభ్యులు ఆత్మహత్యకు ప్రయత్నించిన వెంకటేష్ అనే పందుల పెంపకం దారుని కారణాలు అడిగారు. తాను 50వేలు అప్పుచేసి 40 పందులకు కొని మేపుకొనుచుండగా మునిసిపాలిటీ వారు తన 40 పందులకు విషం పెట్టి చంపారని, బాకీతీర్చే దారిలేక ఆత్మహత్యకు పాల్పడ్డానని చెప్పాడు.

ప్రజల ధన,మాన,ప్రాణాలకు రక్షణగా ఉండవలసిన రక్షకభటులే ఇలా అమానవీయంగా ప్రవర్తించడాన్ని ఓపిడిఆర్ తీవ్రంగా ఖండిస్తుంది. దోషులపై తగు చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది.

అనంతపురం జిల్లా కలెక్టరుగారికి యాడికి మండలం, వేములపాడు గ్రామములోని రజకులు తమ సమస్యను పరిష్కరించవలసినదిగా కోరుచూ వినతి పత్రం సమర్పించినారు. ఓపిడిఆర్ నిజనిర్ధారణ కమిటీ ది.1-2-2011న రచ్చబండ కార్యక్రమంలో జరిగిన సంఘటనపై ది5-2-2011శనివారం వేములపాడు లోని నాయకులను, దళితులను, రజకులను, పోలీసు సబ్ ఇన్సెక్టరు, ఎం.ఆర్వోలతో మాట్లాడిరి.

వేములపాడు గ్రామములో జరిగిన గ్రామపంచాయితీ ఎన్నికలలో రజకకులానికి సంబంధించిన వ్యక్తి ఒక అగ్రవర్ణ అభ్యర్ధి మీద వార్డు మెంబరుగా గెలిచాడు. అప్పటి నుండి గ్రామ సర్పంచి వర్గంవారు మొత్తం రజకకుటుంబాలపై ద్వేషభావంతో ఉంటున్నారని రజకుల ఆరోపణ.

గ్రామంలోని 30-35 రజకకుటుంబాలవారు బట్టలు ఉతికి జీవిస్తున్నారు. దోభీఘాట్ కోసం ప్రత్యేకంగా ఓ బోరు వేస్తే నీరు పడనందున దళితులకోసం వేసిన మరో బోరునుండి నీటిని బట్టలు ఉతకడానికివాడుకుంటున్నారు. దళితవర్గానికి చెందిన ఇద్దరు తమ బోరును ఉపయోగించరాదని రజకులను అడ్డగించారు. సర్పంచి వర్గము వారే వెనుకఉండి దళితులచే ఇలా ఆటంకం కలిగించుతున్నారని రజకులు భావించి ఆగ్రామంలోని ప్రజలందరికీ బట్టలుతకడం మానివేశారు. రజకులకు అనుకూలంగా మాట్లాడేవారు ,వ్యతిరేకంగా మాట్లాడేవారుగా ఆగ్రామం చీలిపోయింది. తమకు అనుకూలంగా మాట్లాడే వారి బట్టలు ఉతికడం ప్రారంభించారు. దానితో మిగిలినవారు మరింత ద్వేషంతో ఆ ఇద్దరు దళితులచే దోభీఘాట్ ను వాడరాదని రజకులను నిరోధింపజేశారు. రజకుల కాలనీలో మురుగు నీరు నిలిచిఉండేలాగా చేసి తమపై కక్ష్యసాధిస్తున్నారని సర్పంచి వర్గంపై రజకులు వ్యతిరేకంగా ఉన్నారు. రచ్చబండ కార్యక్రమంలో సర్పంచి బంధువొకడు ఒక రజక మహిళపై చేయిచేసుకుని త్రోసివేశాడు .అధకారులను న్యాయం చేయమని రజకులు కోరగా రజకులపై 353 సెక్షను క్రింద కేసు నమోదుచేశారని రజకులు వాపోతున్నారు.

సర్వేనంబరు 490 భూమి దోభీఖానాగా, దళతులకూ ఇతర కులాలకు శ్మశానవాటికగా ఉపయోగపడుతుంది. కనుక 13ఎకరాల ఈభూమి లో 56 సెంట్లభూమిని రజకులు కోరుతున్నారు. అవసరానికి మించి ఉన్న ఈ పోరంబోకు భూమిని శ్మశానానికీ, దోభీఖానాకు హద్దులు, విస్తీర్ణాలు నిర్ణయించి వారి తగాదాలు తక్షణమే తీర్చవలసినదిగా ఓపిడిఆర్ ఆశిస్తుంది.

ఇట్లు, సి.లింగమయ్య, రాష్ట్ర కార్యదర్శి, రజక వృత్తిదారుల సమాఖ్య.

జి. నాగభూషణం, జిల్లా కార్యదర్శి, రజక వృత్తిదారుల సంఘం.

ఎం.రామకృష్ణ , జిల్లా కార్యదర్శ, జనవిజ్ఞాన వేదిక,

రాంకుమార్, ఓ.పి.డి.ఆర్. జిల్లా అధ్యక్షులు,

ఎస్.ఎం.బాషా, రాష్ట్ర ఉపాధ్యక్షులు మానవహక్కుల వేదిక.

ఈస్టుకోస్టు ధర్మల్ పవర్ ప్రాజక్టు వ్యతిరేక ఉద్యమకారులపై పోలీసు కాల్పులు

ది.28-2-2011ఈస్టుకోస్టు ధర్మల్ పవర్ ప్రాజక్టు వ్యతిరేక ఉద్యమకారులపై పోలీసు కాల్పులు జరిపారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్ధ (ఓపిడిఆర్) నిజ నిర్ధారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ 5,6 తేదీలలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళీ మండలం , వడ్డితాండ్ర, కాకరాపల్లి, తెలుగు పెంట, హెచ్చిఎన్ పేట, నగిరిపేట, అంట్లవరం, వడ్డివాడ, ఆకాశలక్కవరం, సీరవానిపేట తదితర గ్రామాలలో పర్యటించి, వివరాలు సేకరించారు.

చెరువులు, కుంటలు, కాలువలు, నదులు, సముద్రతీరము వంటివన్నీ ప్రజల ఆస్తులు. వీటిని కాపాడే ట్రష్టీ ప్రభుత్వము. వీటిని ప్రయివేటు పరం చేయరాదని సుప్రీం కోర్టు తెలిపింది. ఎలక్ట్రిసిటీ చట్టం 2003 ప్రకారము తంపర భూముల్లో ధర్మల్ పవర్ ప్రాజక్టులు పెట్టరాదని నిషేధించింది. కాని ప్రభుత్వాధికారులు రెండు పంటలు పండే భూములను మెట్టభూములుగా చూపినందున ప్రాజక్టుకు అనుమతి లభించింది. ప్రాజక్టును 1240 ఎకరాల్లో , ప్రభుత్వభూమిలో నిర్మించామని చెబుతూ 3333 ఎకరాలు ఆక్రమించింది. కొన్నానని చెబుతుంది.

200రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రజలను నేరస్తులుగా చూపి, ఆత్మరక్షణకై కాల్పులు జరిపామని, రబ్బరు బులెట్లే వాడామని, మృతులు జీరు నాగేశ్వరరావు, సీరపు ఎర్రయ్య కుటుంబాలనుంచి పోలీసులు బలవంతంగా తెల్లకాగితాలపై వేలిముద్రలు తీసుకున్నారు. మహిళలు ,పిల్లలు ,వృద్ధులనే విచక్షణ లేకుండా కాల్పులు జరిపి, లాఠీచార్జి చేసి, ఇళ్ళు గడ్డికుప్పలు తగులబెట్టినట్లు తెలిసింది.

3000 ఎకరాలలో విస్తరించివున్న తంపలచెరువుపై 540 మత్యకార కుటుంబాలు 1945వ సంవత్సరం నుండి ఏడాదికి రు.30000 చొప్పున లీజు చెల్లిస్తూ చెరువులో దొరికే తుంగను అమ్మి జీవిస్తున్నారు. 20000 ఎకరాల పొలానికి సాగునీరు , ప్రజలకు తాగునీరు వసతి లభిస్తుంది. ఏవక్కరికీ నష్టపరిహారం ఇవ్వలేదు.

కనుక మృతుల కుటుంబాలకు 20లక్షల, గాయపడినవారికి 10లక్షలరూపాయలు

పరిహారం ఇవ్వాలని , 315 మందిపై పెట్టిన క్రిమినల్ కేసులు రద్దుచెయ్యాలని, కాల్పులు జరిపిన పోలీసులపై కేసు నమోదు చేయాలని , ఈస్టుకోస్టు ధర్మల్ పవర్ ప్రాజక్టుకు ఇచ్చిన అనుమతిని రద్దుచెయ్యాలని, తప్పుడు రిపోర్టు ఇచ్చిన రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదుచేసి ప్రాసిక్యూట్ చెయ్యాలని, ఈస్టుకోస్టు ధర్మల్ పవర్ ప్రాజక్టులోని షేరు హోల్టర్ల వివరాలు బహిరంగ పరచాలని, వడ్డితాండ్రలో ఇళ్ళు కాలిపోయిన కుటుంబాలకు వెంటనే ప్రభుత్వము ఇళ్ళు కట్టించి ఇవ్వాలని, సామానులు ,బట్టలు, ఆహారధాన్యాలు కోల్పోయిన వారికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని ఓపిడిఆర్ డిమాండ్ చేస్తుంది.

Saturday, November 13, 2010

అయోధ్యపై అలహాబాద్ హైకోర్టు అక్రమ తీర్పు

సెప్టెంబరు 30న ఇద్దరు న్యాయాధీశులు –సిగ్భత్ ఉల్లాఖాన్, సుధీర్ అగర్వాల్ లు ఒక తీర్పునివ్వగా ప్రధాన న్యాయాధీశుడు ధరమ్ వీర్ శర్మ విడిగా తీర్పు రాశాడు. బాబ్రీ మసీదులో 1949 డిసెంబరు 23న కొంతమంది చట్ట విరుద్ధంగా సీతారాముల విగ్రహాలను పెట్టిన స్తలమే రాముడు పుట్టిన స్తలంగా హిందూ ప్రజానీకం విశ్వాసం గనుక ఆ స్తలాన్ని హిందూత్వ సంస్థలకు కేటాయించాలి. మొత్తం వివాదాస్పద 1500 గజాల స్తలాన్ని మూడు భాగాలుగా విభజించింది. దౌర్జన్యంగా రామలీలా విగ్రహాలుంచబడిన స్ధలంతో సహా ఒక భాగాన్ని హిందువుల సంస్థకూ, ఒక భాగాన్ని ముస్లీములకు, రామచబుత,సీతరచోయి కట్టడాలతోకూడిన మూడవభాగాన్నిహిందూ సాధువుల సంస్థ నిర్మోహి ఆఖారాకు కేటాయించింది. 1992 డిసెంబరు 6 వరకు అక్కడ మసీదు వుండేదని ఇద్దరు జడ్జీలు అంగీకరించారు కానీ ప్రధాన న్యాయాధీశుడు శర్మ గారు మాత్రం ఆ నిర్మాణానికి మసీదు లక్షణాలు లేవు పొమ్మన్నాడు. కానీ ముస్లీములు దానిని 400సంవత్సరాలుగా విశ్వసిస్తున్నారన్నవిషయం ఆయనకు పట్టలేదు. సమాజంలో ఆధిపత్య భావజాలానికి న్యాయస్థానాలు అతీతం కాదు. కీలవన్మేణి (తమిళనాడు), భన్వారీదేవి (రాజస్తాన్) తీర్పులు నగ్నంగా రుజువు చేసినట్లే అయోధ్య తీర్పుకూడ రుజువు చేసింది.

యస్.ఆర్.శంకరన్ కు నివాళి

హైదరాబాదు 7-10-2010. ఐ.ఏ.ఎస్. అధికారిగా వుండి ఎన్నో ముఖ్య పదవులు నిర్వహించి, నైతిక విలువలు కలిగి, నీతిగా, నిజాయితీగా, మానవతావాదిగా, ప్రజాతంత్రవాదిగా తుది శ్వాసవరకూ నిలిచిన యస్.ఆర్. శంకరన్ గారి మరణం దిగ్బ్రాంతి కరం. ఆయన వంటివారు కాగడా పెట్టి వెదకినా లభించడం ఈ రోజు కన్పించడం అనుమానాస్పదం. దళితులకు విద్య, రిజర్వేషన్ల కోసం ఎన్నో ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చారు. పేద ప్రజలకు ఇండ్ల స్తలాలకోసం, భూసంస్కరణ చట్టం అమలు కోసం, అవినీతి నిర్మూలనకోసం కృషి చేశారు. మన అందరిమధ్య సాధారణ జీవితం గడిపారు. ఆయన కృషి ఫలితంగా 2004లో ప్రభుత్వంతో నక్సలైట్లు చర్చలు జరిపారు. ఆయన మృతి తీరని లోటు.

ఇట్లు,

వి.నారాయణ, సి.భాస్కరరావు.

Sunday, August 29, 2010

కేండ్రుక అర్జున్ ను మావోయిష్టులు ఎందుకు చంపారు?

కేండ్రుక అర్జున్ చాషీమూలియా ఆదివాసి సంఘం కోరాపుట్ జిల్లా కార్యదర్శి.9-8-2010న మావోయిష్టు పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులున్న దళం ప్రపంచ ఆదివాసి దినోత్సవం నాడు అతని గ్రామ సమీపాన పార్వతీపురం – కోరాపుట్ రోడ్డుపై కాల్చిచంపారు. భార్యను వైద్యం కోసం సైకిల్ పై ఎక్కించుకుని వెళుతుండగా ఎస్.ఎల్.ఆర్. రైఫిల్ తో గొంతు వద్ద, 303 తుపాకితో గుండెపై నాలుగు గుండ్లు కాల్చి చంపారు. తన భర్తను చంపవద్దని ఆమె దళంలోని ఒక సభ్యుని కాళ్ళు వాటేసుకుని అర్ధించింది. స్త్రీలు వందలాదిమంది విలపించారు. దాదాపు వెయ్యి మంది అర్జున్ శవాన్ని సంతపోగుపల్లి నుంచి ఏడు కిలోమీటర్ల దూరానగల ఏడుగుమ్మాలవలస వరకు భుజాలపై మోసుకెళ్ళారు.

తమకు నచ్చని రాజకీయ శక్తులను ప్రస్తుత రాజ్యం మట్టుపెడుతున్న తీరులోనే మావోయిష్టు పార్టీకూడా తమకన్నా భిన్నమైన పంధాలో ప్రజా ఉద్యమాలని నిర్మిస్తున్నవారిని భౌతికంగా నిర్మూలించబూనుకోవడం అత్యంత శోచనీయమైన విషయం. సిపిఐ ఎంఎల్ విశ్వం నాయకత్వాన నిర్మింపబడుతున్న ప్రజా ఉద్యమాన్ని విచ్ఛిన్నం చెయ్యడం కోసం, ఆ ప్రాంతం నుండి ఆ పార్టీని తరిమివేయడం కోసం తద్వారా ఆంధ్రా, ఒరిస్సా బోర్డర్ గ్రామాలన్నిటినీ మీ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చాషీమూలియా ఆదివాసీ సంఘం నాయకులను, సానుభూతిపరులను హత్యచేస్తున్నారనీ, బెదిరిస్తున్నారనీ మేము భావిస్తున్నాము. మాలేఖకు బహిరంగ సమాధానము లభిస్తుందని ఆశిస్తున్నాము.

ఓపిడిఆర్ ఇమెయిల్ opdr_ap@hotmail.com

C.Bhaskararao ,chavali.Sudhakararao, v.Narayana