Saturday, November 13, 2010

అయోధ్యపై అలహాబాద్ హైకోర్టు అక్రమ తీర్పు

సెప్టెంబరు 30న ఇద్దరు న్యాయాధీశులు –సిగ్భత్ ఉల్లాఖాన్, సుధీర్ అగర్వాల్ లు ఒక తీర్పునివ్వగా ప్రధాన న్యాయాధీశుడు ధరమ్ వీర్ శర్మ విడిగా తీర్పు రాశాడు. బాబ్రీ మసీదులో 1949 డిసెంబరు 23న కొంతమంది చట్ట విరుద్ధంగా సీతారాముల విగ్రహాలను పెట్టిన స్తలమే రాముడు పుట్టిన స్తలంగా హిందూ ప్రజానీకం విశ్వాసం గనుక ఆ స్తలాన్ని హిందూత్వ సంస్థలకు కేటాయించాలి. మొత్తం వివాదాస్పద 1500 గజాల స్తలాన్ని మూడు భాగాలుగా విభజించింది. దౌర్జన్యంగా రామలీలా విగ్రహాలుంచబడిన స్ధలంతో సహా ఒక భాగాన్ని హిందువుల సంస్థకూ, ఒక భాగాన్ని ముస్లీములకు, రామచబుత,సీతరచోయి కట్టడాలతోకూడిన మూడవభాగాన్నిహిందూ సాధువుల సంస్థ నిర్మోహి ఆఖారాకు కేటాయించింది. 1992 డిసెంబరు 6 వరకు అక్కడ మసీదు వుండేదని ఇద్దరు జడ్జీలు అంగీకరించారు కానీ ప్రధాన న్యాయాధీశుడు శర్మ గారు మాత్రం ఆ నిర్మాణానికి మసీదు లక్షణాలు లేవు పొమ్మన్నాడు. కానీ ముస్లీములు దానిని 400సంవత్సరాలుగా విశ్వసిస్తున్నారన్నవిషయం ఆయనకు పట్టలేదు. సమాజంలో ఆధిపత్య భావజాలానికి న్యాయస్థానాలు అతీతం కాదు. కీలవన్మేణి (తమిళనాడు), భన్వారీదేవి (రాజస్తాన్) తీర్పులు నగ్నంగా రుజువు చేసినట్లే అయోధ్య తీర్పుకూడ రుజువు చేసింది.

యస్.ఆర్.శంకరన్ కు నివాళి

హైదరాబాదు 7-10-2010. ఐ.ఏ.ఎస్. అధికారిగా వుండి ఎన్నో ముఖ్య పదవులు నిర్వహించి, నైతిక విలువలు కలిగి, నీతిగా, నిజాయితీగా, మానవతావాదిగా, ప్రజాతంత్రవాదిగా తుది శ్వాసవరకూ నిలిచిన యస్.ఆర్. శంకరన్ గారి మరణం దిగ్బ్రాంతి కరం. ఆయన వంటివారు కాగడా పెట్టి వెదకినా లభించడం ఈ రోజు కన్పించడం అనుమానాస్పదం. దళితులకు విద్య, రిజర్వేషన్ల కోసం ఎన్నో ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చారు. పేద ప్రజలకు ఇండ్ల స్తలాలకోసం, భూసంస్కరణ చట్టం అమలు కోసం, అవినీతి నిర్మూలనకోసం కృషి చేశారు. మన అందరిమధ్య సాధారణ జీవితం గడిపారు. ఆయన కృషి ఫలితంగా 2004లో ప్రభుత్వంతో నక్సలైట్లు చర్చలు జరిపారు. ఆయన మృతి తీరని లోటు.

ఇట్లు,

వి.నారాయణ, సి.భాస్కరరావు.

Sunday, August 29, 2010

కేండ్రుక అర్జున్ ను మావోయిష్టులు ఎందుకు చంపారు?

కేండ్రుక అర్జున్ చాషీమూలియా ఆదివాసి సంఘం కోరాపుట్ జిల్లా కార్యదర్శి.9-8-2010న మావోయిష్టు పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులున్న దళం ప్రపంచ ఆదివాసి దినోత్సవం నాడు అతని గ్రామ సమీపాన పార్వతీపురం – కోరాపుట్ రోడ్డుపై కాల్చిచంపారు. భార్యను వైద్యం కోసం సైకిల్ పై ఎక్కించుకుని వెళుతుండగా ఎస్.ఎల్.ఆర్. రైఫిల్ తో గొంతు వద్ద, 303 తుపాకితో గుండెపై నాలుగు గుండ్లు కాల్చి చంపారు. తన భర్తను చంపవద్దని ఆమె దళంలోని ఒక సభ్యుని కాళ్ళు వాటేసుకుని అర్ధించింది. స్త్రీలు వందలాదిమంది విలపించారు. దాదాపు వెయ్యి మంది అర్జున్ శవాన్ని సంతపోగుపల్లి నుంచి ఏడు కిలోమీటర్ల దూరానగల ఏడుగుమ్మాలవలస వరకు భుజాలపై మోసుకెళ్ళారు.

తమకు నచ్చని రాజకీయ శక్తులను ప్రస్తుత రాజ్యం మట్టుపెడుతున్న తీరులోనే మావోయిష్టు పార్టీకూడా తమకన్నా భిన్నమైన పంధాలో ప్రజా ఉద్యమాలని నిర్మిస్తున్నవారిని భౌతికంగా నిర్మూలించబూనుకోవడం అత్యంత శోచనీయమైన విషయం. సిపిఐ ఎంఎల్ విశ్వం నాయకత్వాన నిర్మింపబడుతున్న ప్రజా ఉద్యమాన్ని విచ్ఛిన్నం చెయ్యడం కోసం, ఆ ప్రాంతం నుండి ఆ పార్టీని తరిమివేయడం కోసం తద్వారా ఆంధ్రా, ఒరిస్సా బోర్డర్ గ్రామాలన్నిటినీ మీ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చాషీమూలియా ఆదివాసీ సంఘం నాయకులను, సానుభూతిపరులను హత్యచేస్తున్నారనీ, బెదిరిస్తున్నారనీ మేము భావిస్తున్నాము. మాలేఖకు బహిరంగ సమాధానము లభిస్తుందని ఆశిస్తున్నాము.

ఓపిడిఆర్ ఇమెయిల్ opdr_ap@hotmail.com

C.Bhaskararao ,chavali.Sudhakararao, v.Narayana

Friday, July 9, 2010

ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ జిహాదీలతో కుమ్మక్కయింది

ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ జిహాదీలతో కుమ్మక్కయింది - గీత సహగల్ ఆరోపణ

గీత సహగల్ ప్రముఖ నవలా రచయిత, సయంత్రాసహగల్ కుమార్తె. ఆమె ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ లండన్ కేంద్ర ఆఫీసులో లింగత్వ విభాగ సీనియర్ అధికారి. మానవ హక్కుల సంరక్షణ పేరుతో ఆమ్నెస్టి జిహాదీలతో కుమ్మక్కయిందని ఆమె అంటున్నట్లు ది సండే టైమ్స్ పత్రిక వ్రాసింది. వెంటనే ఆమ్నెస్టి ఆమెను సంస్థ నుండి సస్పెండ్ చేసింది.

దీని గురించి భారతదేవ పత్రిక ది హిందు లండన్ విలేఖరి ఫిబ్రవరి 9న ఇలా వ్రాసారు. సహగల్ చాలా కాలంగా హక్కుల ఉద్యమంలో పని చేస్తున్న కార్యకర్త. ఆమె ది హిందుతో ఈ క్రింది విషయాలు చెప్పారు. " ఈ విషయాన్ని ముందు సంస్ధలోపట చర్చకు పెట్టాను, ఆమ్నెస్టి దాన్ని పట్టించుకోలేదు. అందువల్ల బహిరంగంగా ప్రకటించక తప్పలేదు. ఈ విషయం పత్రికల్లో ప్రచురితమైన కొన్ని గంటల్లోనే నన్ను సంస్ధ నుండి సస్పెండ్ చేశారు ". ఆ వార్తా కథనం ఇంకా ఈ క్రింది పేర్కొన్న అంశాలతో కూడివుంది.

1) ఈ ఆరోపణపై అంతర్గత విచారణకు ఆమ్నెస్టి చర్యలు తీసుకొంది. ఆ నివేదిక కోసం ఆగకుండానే సంస్థ అంతర్జాతీయ చట్టాలు మరియు విధాన విభాగ సీనియర్ డైరెక్టరు వైడ్నెబ్రౌన్ ఆ ఆరోపణలను తిరస్కరించారు. జిహాదీలు చేస్తున్న హక్కుల ఉల్లంఘనలను మేము నిర్ద్వందంగా వ్యతిరేకించిన రికార్డు మాకుంది అని వైడ్నెబ్రౌన్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.

2) " పంజరంలో ఖైదీలు " అనే ప్రచార సమూహాలతో ఆమ్నెస్టి సంస్థ కలసి పనిచేయడం వివాదానికి కేంద్రబిందువయింది. ఈ ప్రచారోద్యమ వేదికను గ్వాంటనమబే మాజి ఖైది మొఅజ్జంబెగ్గు ఏర్పాటు చేశారు. తాను తాలిబాన్ అభిమానినని బెగ్గు స్వయంగా అంగీకరించారు. గ్వాంటనమబే జైలును రద్దు చేయాలనీ, అందులో నిర్బంధించినవారికి పునరావాసం కల్పించాలనీ పెద్దఎత్తున ఈ సమూహం చేసిన ప్రచారానికి ఆమ్నెస్టి మద్దతు ఇచ్చింది. బెగ్గు అతని సహచరులు బ్రిటను ప్రధాని గోర్డన్ బ్రౌనును కలసి వినత పత్రం యిచ్చేందుకు వెళ్ళినప్పుడు ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ఇంగ్లాండు అధినేత కటెఅల్లెను కూడ వారితోబాటు వెళ్ళారు.

3) గ్యాంటనమబేలో తనను నిర్బంధించిన మూడు సంవత్సరాల కాలంలో అమెరికా అధికారులు తనను హింసించినట్లు మొ అజ్జంబెగ్గు చెబుతుంటాడు. తాలిబాన్లకు మద్దతు ప్రకటించడాన్ని కూడ ఆయన సమర్ధించుకుంటాడు. కాని అల్-ఖైదాతోగాని మరేయితర టెర్రరిష్టు గ్రూపులతోగాని తనకు సంబంధాలు లేవంటాడు. పంజర ఖైదీలు ( Cage Prisoners ) వేదిక ఉద్దేశ్యం గ్యాంటనమబే ఖైదీల దుస్థితిని లోకానికి వెల్లడిచెయ్యటమేనని అతను నొక్కివక్కాణిస్తున్నాడు.

4) ఈ సమస్యపై సహగల్ వైఖరికి ఇంగ్లాండులో విస్తారమైన మద్దతు లభించింది. చట్టవిరుద్ధ నిర్బంధాన్నిగ్వాంటనమబే ఖైదీలపై చిత్రహింసలను తాను పూర్తిగా వ్యతిరేకించానని సహగలే అన్నారు. " మొ అజ్జంబెగ్గు లాంటి వ్యక్తులతో జైలు అధికారులు వ్యవహరించిన తీరుకు నేనెంతో తల్లడిల్లాను " అని ఆమె అన్నారు. కానీ ఇంగ్లాండులో " తాలిబాను మద్దతుదారులలో బెగ్గు అత్యంత ప్రముఖుడు " అలాంటి వ్యక్తితో ఆమ్నెస్టి వేదికను పంచుకోవటమనేది అనుచితమైన నిర్ణయం అని ఆమె అంటున్నారు.

5) ఒక ప్రకటనలో సహగల్ ఇలా అంటున్నారు : " సమస్య మొ అజ్జంబగ్గు భావప్రకటన స్వేచ్చ విషయం కాదు. అతను తన యొక్క అభిప్రాయాలను ప్రకటించుకునే అంశం కూడా సమస్యకాదు. అతను ఈ హక్కులను పూర్తిగా వినియోగించుకున్నాడు. మరి సమస్య ఏమిటి? మానవహక్కుల సార్వజనీనతకు భంగం కలిగించే గ్రూపులు మరియు ఆలోచనలతో సహేతుకంగా మానవహక్కుల ఉద్యమం విడగొట్టుకోవాలా లేదా అన్నదే సమస్య, మౌలిక ప్రాధాన్యత గల మానవ హక్కుల పట్ల నాకున్న నమ్మకం వల్ల ఈ సమస్యను నేను లేవనెత్తాను ".

ఈ వార్తా కథనంపై జనపథం చర్చను ఆహ్వానిస్తున్నది.

Friday, January 22, 2010

ఆంధ్ర మహాసభ నుండి శ్రీ బాగ్ ఒప్పందం వరకు

ఆరోజు 1917, ఏప్రిల్, 8వ తారీకు . అనీబిసెంటు అధ్యక్షతన కలకత్తా కాంగ్రెస్ మహాసభ జరుగుతుంది. తీవ్ర చర్చల అనంతరం రాత్రి 10-గంటల 15 నిముషాలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘం ఏర్పాటుకు అఖిలభారతకాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను గాంధీగారు వ్యతిరేకించినా, తిలక్ బలపరచి ఆమోదించాడు.
రాయలసీమ
అనంతపురం, బళ్ళారి, కడప జిల్లాలను నైజాం నవాబు బ్రిటీష్ వారికి దత్తం చేశాడు. బ్రిటీష్ వారు కర్నూలును బలవంతంగా తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు. 1911లో కడప జిల్లాలో కొంతభాగాన్మి , ఉత్తర ఆర్కూట్ జిల్లా నుంచి తెలుగుమాట్లాడే ప్రాంతాలను కలిపి చిత్తూరు జిల్లాను ఏర్పాటు చేశారు.
ప్రప్రధమంగా 19-1-1928న నంద్యాలలో దత్తమండల జిల్లాల మహాసభ కడప కోటిరెడ్డిగారి ఆధ్యక్షతన జరిగింది. ఈ సభలో ఆనంతపురం, బళ్ళారి, కడప, కర్నూలు జిల్లాలకు చిలుకూరి నారాయణరావు ‘ రాయలసీమ ’ అని నామకరణం చేసారు.
ఆంద్రోద్యమ సభలు
ఆంద్రోద్యమ ప్రారంభం నుండి అనగా 1913 నుండి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సీమవారు వ్యతిరేకులు కారు. కానీ, అభివృధ్ధి చెందిన సర్కారు ప్రాంతం నుంచి సీమప్రగతికి సరైన సహకారమందుతుందా...అనే సంశయం వీరికి ఉంది. మద్రాసు వీరికి దగ్గరగా ఉండడం, మొదటినుండి వ్యాపార లావాదేవీలు, విద్య, రాజకీయవిషయాలు ఆనగరంతో ముడిపడిఉండడం , హైకోర్టు, విశ్వవిద్యాలయం, ఇతర కార్యాలయాలు రాజమండ్రి లాంటి దూరప్రాంతంలో ఉంటే వారికి కష్టంగా ఉంటుందనేది మరొక కారణం.
1913 న 800 మందితో జరిగిన ఆంద్రమహాసభకు రాయలసీమ నుండి ఇద్దరే హాజరైనారు. కేశవపిళ్ళే , జి.లక్ష్మీరెడ్డి మరికొందరు ఆంధ్రరాష్ట్రాన్ని వ్యతిరేకించారు.1924 జనవరి 13వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఆనుమతించింది. ఆప్పటినుండి సర్కారు రాయలసీమ సంబంధాలు బెడిసికొట్టాయి.
రాజకీయంగా నిరాదరణ
శ్రీమాన్ రాజగోపాలాచారి ముఖ్యమంత్రి (మద్రాసు) మొత్తం 26మంది మంత్రివర్గంలో సర్కారు వారిని 10 మందిని తీసుకొని , రాయలసీమ వారిని ఒక్కరిని కూడా తీసుకోలేదు
ఎ.పి.సి.సి. వైస్ ప్రసిడెంటు పదవికి కోటిరెడ్డి(సీమ) గారిని ప్రతిపాదించితే కాళేశ్వరరావు (బెజవాడ) వ్యతిరేకించి కోటిరెడ్డిని ఓడించాడు.
పట్టభద్రులనుంచి రెండు సెనెట్ సీట్లకు పార్టీ ప్రాతిపదికపై పోటీ జరిగింది. అధికార అభ్యర్ధులైన ఇద్దరు రాయలసీమ నాయకులను కాంగ్రెసుకు మెజారిటీ ఉన్నప్పటికీ ఓడించారు.
అవగాహనా ఒప్పందం
1937 ఆంధ్రమహాసభ బెజవాడలో కడప కోటిరెడ్డిగారి అధ్యక్షతన జరిగింది. హెచ్చి.సీతారామిరెడ్డి (బళ్ళారి), టి.ఎన్. రామకృష్ణారెడ్డి (చిత్తూరు), కల్లూరి.సుబ్బారావు, పి.రామాచార్యులు (అనంతపురం) పాల్గొని , వేదికను పూర్తిగా ఉపయోగించుకొని, రాయలసీమప్రజల సమస్యలను, అభిప్రాయాలను, అన్నివిధాలా జరిగిన మోసాలను, సర్కారాంధ్ర నాయకులపై ఉన్న అపోహలను, నిర్మొహమాటంగా, స్పష్టంగా వివరించారు. రాయలసీమవారికి కొన్ని రక్షణ ఏర్పాట్లు చేస్తేతప్ప రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలో కలవదని చెప్పారు.
1) రాష్ట్ర రాజధాని మద్రాసుగానీ, రాయలసీమలో ఏదో ఒక పట్టణంకాని అయివుండాలి.
2) శాసనసభలో రాయలసీమకు సరియైన ప్రాతినిధ్యము ఉండాలి.
3) సరిసమాన సంఖ్యలో మంత్రులుండాలి.
4) ఆర్ధిక వెనుకబాటుతనం మూలాన వెంటనే తుంగభద్ర, హగరి ప్రాజక్టులు చేపట్టాలి.
5) రాష్ట్ర ఆదాయాన్ని సమానంగా పంచాలి.
ఈతీర్మానాలు సభలో ప్రవేశపెట్టడం, ఏకగ్రీవంగా ఆమోదంపొందడం జరిగింది. సభ ముగిసిన వెంటనే సభ్యులందరూ మద్రాసులో కాశీనాధుని నాగేశ్వరరావుగారి శ్రీబాగ్ మహలు (Sri Baugh Palace) నందు 19 నవంబరు 1937న సమావేశమై ( సర్కారాంధ్ర, రాయలసీమ ) సామరస్యసాధనగా పెద్దమనుషుల ఒప్పందం ( శ్రీబాగ్ ఒడంబడిక ) సాధించారు. ఆస్థల గౌరవార్ధం ఆ ఒడంబడికను శ్రీబాగ్ ఒడంబడికగా పిలవడం జరిగింది.